: బీసీసీఐకి మరో ఎదురుదెబ్బ
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారించేందుకు తాము ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ చెల్లదని బాంబే హైకోర్టు తీర్పివ్వగా.. దాన్ని బీసీసీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. బాంబే హైకోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, ఈ వ్యవహారంలో వాదనలు వినేందుకు మాత్రం అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఐపీఎల్-6లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ ప్రమేయం ఉందని వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో, శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష విధులకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జగ్మోహన్ దాల్మియా ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకే ద్విసభ్య కమిటి వేయగా.. అది శ్రీనివాసన్, గురునాథ్ లకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో, ఇక శ్రీనివాసన్ మళ్ళీ బోర్డు పగ్గాలు చేపట్టడం లాంఛనమే అనుకున్నారు. అనూహ్యంగా బాంబే హైకోర్టులో బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఒకరు పిటిషన్ వేయడంతో ఆ కమిటీ నియామకం చెల్లదని కోర్టు స్పష్టీకరించింది.