: రాష్ట్రాల్లో చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర: గాలి ముద్దుకృష్ణమ


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ కు ఇలాంటి రాజకీయాలు అలవాటే అని ఆయన మండి పడ్డారు. అధికారంలో ఉంటే ఓ విధంగా, లేకుంటే మరో విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు. హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ఏమీ చెప్పకుండానే విభజన చేశారని ఆయన దుయ్యబట్టారు.

సీఎం, పీసీసీ చీఫ్ లకు ఈ విషయం ముందే తెలిసినా కిమ్మనకుండా ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై సీఎం, బొత్సకు ముందే సమాచారముందంటూ డీఎస్ చెప్పిన విషయాన్ని గాలి ఈ సందర్భంగా ఉటంకించారు. ఇక తెలంగాణ విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ, అన్ని పార్టీలు చంద్రబాబును దోషిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అది సబబు కాదని అన్నారు.

లేఖ ఒక్క టీడీపీ పార్టీయే ఇవ్వలేదని, వైఎస్సార్సీపీ కూడా లేఖ ఇచ్చిందని, తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆ లేఖలో స్పష్టం చేశారని వివరించారు. ఇడుపులపాయ ప్లీనరీలోనూ రాష్ట్ర విభజనకు అభ్యంతరంలేదని తీర్మానించారని గుర్తు చేశారు. అసలు రాష్ట్ర విభజనకు బీజం వేసిందే వైఎస్ అయితే చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం సహించబోమన్నారు. సీమాంధ్రలో వెల్లువెత్తిన ప్రజాగ్రహం పట్ల మాట్లాడుతూ, కేసీఆర్ నోటి దురుసుతనం వల్లే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని ఆరోపించారు. కేసీఆర్ ఏ హోదాలో ఇష్టారీతిన ప్రకటనలు చేస్తున్నారని గాలి ముద్దుకృష్ణమ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News