: రక్షణ మంత్రి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బీజేపీ
జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత జవాన్లపై కాల్పుల ఘటనకు సంబంధించి పార్లమెంటులో రక్షణ మంత్ర ఏకే ఆంటోనీ చేసిన ప్రకటనపై వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండు చేసింది. ఐదుగురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన అంశంపై రక్షణ మంత్రి చేసిన ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉందని విమర్శించింది. ఆర్మీ దుస్తుల్లో ఉన్న పాక్ మిలిటెంట్లు కాల్పులు జరిపారని రక్షణ మంత్రి చెప్పగా, పాకిస్తాన్ సైనికులే ఈ ఘటనకు బాధ్యత వహించాలని మరో ప్రకటన చేయడం అందరినీ తికమకకు గురి చేస్తోందని ఆ పార్టీనేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఈ ప్రకటనలపై ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ డిమాండు చేశారు.