: ఐఏఎస్ అధికారి నచ్చడం లేదా.. అయితే, సస్పెండ్ చేసేయ్!


ఐఏఎస్ అధికారులంటే నచ్చడం లేదా? నిబంధనల ప్రకారం వారు చేసే పనులు ఇబ్బంది పెడుతున్నాయా? ప్రభుత్వ పనులకు అడ్డుపుల్లల్లా మారుతున్నారా? ఇంకెందుకు జులుం చూపించి తక్షణమే సస్పెండ్ చేసెయ్! ఇదీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఐఏఎస్ అధికారులపై చూపుతున్న ధోరణి. అలా ఇరవై ఏళ్లలో మనదేశంలో 200 మంది ఐఏఎస్ అధికారులు సస్పెన్షన్ కు బలయ్యారు. ప్రధానంగా ఈ సంఖ్య ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఇన్ని సంవత్సరాల్లో ఒక్క యూపీలోనే వంద మంది ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ లెక్కలు చెబుతున్నాయి. 60 శాతం మంది అధికారులు గత ప్రభుత్వం బహుజన సమాజ్ వాదీ హయాంలో సస్పెండ్ అయితే, 35 శాతం మంది సమాజ్ వాదీ అధికారంలో అయ్యారని వివరిస్తున్నాయి. ఇలా వందలకొద్దీ అధికారులు ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలకు బలవుతున్నారు. దీనిపై ఓ ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ... 'సివిల్ సర్వీస్ అంటే ప్రజలకు సేవ చేయడం. కానీ, ఇప్పుడది ప్రయివేటు వ్యక్తులకు సేవ చేసేదిగా మారింది. తాము రాజకీయ నాయకులకు బానిసలమా?' అని ప్రశ్నిస్తున్నారు.

ఇందుకు నిదర్శనం యూపీలో సంచలనం సృష్టిస్తున్న ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారం. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఆమెను.. ఓ ప్రయివేటు వ్యక్తి తన ప్రాబల్యంతో కేవలం 40 నిమిషాల్లో సస్పెండ్ చేయించాడు. ఈ విషయాన్ని చాలా గర్వంగా కూడా చెప్పుకున్నాడు సదరు వ్యక్తి. ఎందుకలా చేసిందో సరిగా తెలుసుకోకుండానే అధికారిణిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అందరూ ఆమెనే విమర్శించారు. సరైన శిక్ష పడిందన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ కూడా రాశారు. దాంతో, ఈ వ్యవహారం సమాజ్ వాదీ, కాంగ్రెస్ మధ్య ఘర్షణకు తెరతీసింది.

ఇలాంటి వ్యవహారంలో కాంగ్రెస్ ఏమైనా తక్కువ తిన్నదా అంటే అదీ లేదు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారంలో దర్యాప్తు జరిపించాలని కొన్ని నెలల కిందట అశోక్ ఖేమ్కు అనే ఐఏఎస్ అధికారి ఆదేశించడంతో ఆయన ట్రాన్సఫర్ బారిన పడ్డారు. అప్పటికే ఆయన పలుమార్లు ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతూనే రాజకీయ నేతల కంట్లో నలుసుగా మారారు. అలా తనకు గిట్టని అధికారులపై కాంగ్రెస్ కూడా చర్యలు తీసుకునేందుకు వెనుకాడదు.

  • Loading...

More Telugu News