: ఔషధ మాయ.. జనరిక్ మందులు ఎంత చవకో!
డాక్టర్ దగ్గరకు వెళతాం.. మనల్ని పరీక్షించి వ్యాధి నివారణకు పలు మందులను సూచిస్తాడు. ఆయన రాసేవి బహుళజాతి కంపెనీలవైనా అయి ఉంటాయి. లేదంటే జనరిక్ ముందులైనా కావచ్చు. ఇక్కడో మాయ దాగుంది. బహుళజాతి కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి. డాక్టర్ ఎంతమేర రాస్తే.. అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి. ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి. అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి.
కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి ఆ ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువ. అందుకే బహుళ జాతి, అగ్రగామి ఫార్మా కంపెనీల బ్రాండెడ్ ఔషధాల కంటే జనరిక్ మందులు చాలా చౌకలో లభిస్తాయి. పేద రోగులకు ప్రయోజనం కల్పించడానికి వీలుగా దేశంలో కొన్ని రాష్ట్రాలలో జనఔషధి మందుల స్టోర్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జనరిక్ ఔషధాలు ఎలాంటి మాయ లేకుండా చాలా తక్కవ ధరకే లభిస్తాయి.
కేంద్ర రసాయనాల శాఖ సహాయ మంత్రి శ్రీకాంత్ జెనా ఇదే విషయమై లోక్ సభలో సభ్యుల ప్రశ్నకు వివరణ ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం.. నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ ఎస్ఆర్ బ్రాండెడ్ 10 మందుల ధర 51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో 3.35రూపాయలు మాత్రమే. 100 ఎంఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45రూపాయలే.
ఉత్పత్తుల ప్రచారం తదితర కారణాల వల్లే బ్రాండెడ్ ఔషధాలు ఎక్కువ ధర ఉంటాయని మంత్రి చెప్పారు. కొన్ని బ్రాండెడ్ ఔషధాలకు పేటెంట్ హక్కులు ఉంటాయని, వాటిని మిగతా కంపెనీలు తయారు చేయడానికి వీల్లేదని.. అలాంటివి కూడా ఖరీదుగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి జనఔషధి స్టోర్లు విశాఖ, హైదరాబాద్ లోనూ ఉన్నాయి.