: మా సినిమాకు శ్రీలంక అధ్యక్షుడు నిధులందించలేదు: జాన్ అబ్రహాం
'మద్రాస్ కేఫ్' సినిమా రిలీజ్ కు ముందే వివాదాల్లో నిలిచింది. ఎల్టీటీఈ మిలిటెంట్ల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23న హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకు శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స నిధులు సమకూర్చారన్న వార్తలపై హీరో జాన్ అబ్రహాం స్పందించాడు. నేడు చెన్నైలో 'మద్రాస్ కేఫ్' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జాన్, తమ చిత్రం వయాకామ్ 18 సంస్థ నిర్మాణంలో రూపుదిద్దుకుందని వెల్లడించారు. రాజపక్స రహస్యంగా నిధులు సమకూర్చారన్న వార్తల్లో వాస్తవం లేదన్నాడు. అయినా, ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించామని వివరించాడు. కాగా, మద్రాస్ కేఫ్ లో లీడ్ రోల్ పోషిస్తున్న ఈ కండలరాయుడు ఈ సినిమాకు సహనిర్మాత కూడా. జాన్ సరసన ఈ సీరియస్ మూవీలో నర్గీస్ ఫక్రీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.