: చైనా, పాక్ లనుంచి ముప్పు పొంచి ఉంది:ములాయం
చైనా, పాకిస్థాన్ దేశాల నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందని ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాల్ని ఉల్లంఘిస్తూ ఎప్పటికప్పుడు సైనికుల్ని పొట్టన బెట్టుకుంటూనే ఉందని, మరోవైపు చైనా మన భూభాగంలోకి చొరబడుతూ దురాక్రమణకు తెరతీస్తోందని మండిపడ్డారు. పాక్ పూంచ్ సెక్టార్ లో జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవానులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా.. భారత్ పై దాడికి తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో పెట్టుబడులు పెడుతోందని అన్నారు. ఇప్పటికే ఆయా దేశాల్లో పాగావేసి భారత దేశాన్ని దిగ్భంధనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని అన్నారు. తక్షణం స్పందించకుండా చోద్యం చూస్తే భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతగులుతుందని ములాయం స్పష్టం చేశారు.