: తెగించిన కిరణ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం తెగింపు ధోరణి కనబర్చాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. చారిత్రక ఘట్టమైన రాష్ట్ర విభజన తాను అధికారంలో ఉండగా జరగడాన్ని భరించలేకపోతున్న సీఎం, ఈ క్రమంలో అధిష్ఠానంతో ఢీకొట్టేందుకైనా సిద్ధమైనట్టు తాజా పరిణామాలు తెలుపుతున్నాయి. గత కొద్దిరోజుల వరకు మౌనంగా ఉన్న కిరణ్..సీమాంధ్రలో నిరసనజ్వాలలు తీవ్రతరం కావడంతో ఇక ఉపేక్షించరాదని నిర్ణయం తీసుకున్నారు. అందుకే, వెంటనే సోనియాకు లేఖ రాసి తన గుండెలను చీల్చుకుని వచ్చిన మాటలను అందులో పొందుపరిచారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యాంధ్రకే మొగ్గు చూపాలంటూ అధినేత్రిని కోరారు.
అయితే, ఇప్పటికే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని చిదంబరం పార్లమెంటులో విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో.. సీఎం కిరణ్ ఇంత ధైర్యంగా సమైక్య వాణిని వినిపించడం ఆయన తెగువను చాటుతోంది. రాష్ట్రం మళ్ళీ ఒక్కటవడం కల్ల అని, రాజధాని సంగతి ఆలోచిద్దాం అంటూ దిగ్విజయ్ సింగ్ చెబుతున్న దశలో సీఎం.. తాజా లేఖ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతోంది. పదవి పోయినా ఫరవాలేదు, రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోనని కిరణ్ నిన్న సీమాంధ్ర మంత్రులతో భేటీలో అన్నట్టు సమాచారం. తాను యాభై ఏళ్ళ వయసులోనే సీఎం అయ్యానని, ఇంతటి విషాద ఘట్టం తన చేతుల మీదుగా నిర్వహించలేనని, సర్వశక్తులూ ధారపోసి విభజనను అడ్డుకుంటానని భేటీలో చెప్పినట్టు తెలుస్తోంది.