: జమ్మూ కాశ్మీర్ కాల్పులపై ప్రధాని ప్రకటన చేయాలి: బీజేపీ
జమ్మూకాశ్మీర్ లో సరిహద్దుల వద్ద భారత సైన్యంపై పాక్ కాల్పుల ఘటన రాజ్యసభను కుదిపేసింది. కాల్పుల ఘటనపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు పట్టు వీడకపోవడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
మరోవైపు, అమెరికా ప్రపంచ అలెర్ట్ ప్రకటించింది. పాక్ లోని ఇస్మాయిల్ ఖాన్ జైలు నుంచి 252 మంది తాలిబాన్ తీవ్రవాద ఖైదీలు తప్పించుకోవడంతో పెద్ద ముప్పు ప్రపంచానికి ఎదురుకానుందని, ప్రమాదం ఏ వైపునుంచి వస్తుందో తెలియదు కానీ , ముప్పు మాత్రం పొంచి ఉందని స్పష్టం చేసింది. అందువల్ల తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనికి తోడు పాక్ సైన్యం గత మూడు రోజులుగా భారత సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతూనే ఉంది. తాజా పరిణామాలతో భారతదేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహకరిస్తూ కాల్పులు జరుపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.