: పలు వ్యాధులకు ప్యాచ్‌తో చికిత్స
హైబీపీ, గుండెపోటు, పక్షవాతం ఇలా పలు రకాలైన వ్యాధులకు ఒక కొత్తరకమైన చికిత్సను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఔషధంతో కూడిన ఒక ప్యాచ్ వేయడం ద్వారా ఇలాంటి వ్యాధులకు చికిత్స చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్యాచ్‌ని రోగి భుజానికి, ఛాతీ, వీపుపైన ఇలా ఎక్కడైనా అమర్చుకుంటే చాలు. ఇక చికిత్స ప్రారంభమైనట్టే.
జపాన్‌కు చెందిన నిటోడెంకో అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ ప్యాచ్‌లోనే ఔషధాన్ని ఉంచి రోగులకు వేస్తారు. దీంతో చికిత్స ప్రారంభమవుతుంది. ఈ ప్యాచ్‌లో ఓ బీటాబ్లాకర్ రకానికి చెందిన ఔషధం 'బైసోప్రొలాల్'ను క్రమబద్ధంగా అందజేస్తుంది. క్రమపద్ధతిలో నిరంతరంగా ఔషధం అందడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్యాచ్ చికిత్సకు జపాన్‌లో అనుమతి లభించగానే రెండు మూడేళ్లలో ఇది బ్రిటన్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ప్రతి ప్యాచ్‌లోను నాలుగు లేదా ఎనిమిది మిల్లీగ్రాముల మోతాదులో ఔషధం ఉంటుంది. అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె వైఫల్యం చెందడం, ఆందోళన, పార్వ్శనొప్పి వంటి వ్యాధుల్లో బీటా బ్లాకర్లను 50 ఏళ్లుగా వాడుతున్నారు. ఈ ప్యాచ్‌తో రక్తపోటు నియంత్రణ మెరుగవుతుందని వీటిని తయారు చేసిన జపాన్‌కు చెందిన సంస్థ నిటోడెంకో చెబుతోంది. ఈ ప్యాచ్‌ను ఉపయోగించినపుడు 24 గంటలపాటు రక్తపోటు స్థిరంగా ఉన్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైందని సంస్థ చెబుతోంది.