: సీజన్‌కన్నా ముందే పూలు పూస్తున్నాయి
మన భూమిపైన కొన్ని రకాలైన పూలు కొన్ని సీజన్లలోనే పూస్తాయి. అలాగే ఫలదీకరణ కాలం పూర్తయిన తర్వాత ఏ ప్రాణి అయినా పుట్టడం జరుగుతుంది. అయితే సముద్రంలో సీజన్‌కన్నా కూడా ముందే పూలు పూస్తున్నాయట. అలాగే చేపలు కూడా మామూలుకన్నా 11 రోజుల ముందే పుడుతున్నాయట. శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలను నిర్వహించి ఈ విషయాలను చెబుతున్నారు. అయితే వీటన్నింటికీ కారణం ఏమంటే భూతాపం పెరిగిపోవడమే అంటున్నారు శాస్త్రవేత్తలు.
రోజురోజుకూ భూతాపం పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూతాపం సముద్రంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అనే విషయంలో పలువురు శాస్త్రవేత్తలు అధ్యయనాలను నిర్వహించారు. ఈ అధ్యయనంలో పై విషయాలు తేలాయి. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు భూతాపం కారణంగా సముద్రంలోని జీవుల్లోను, పుష్పజాతుల్లోను భారీ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఆష్ట్రేలియా, అమెరికా, ఐరోపా తీరాలు, అట్లాంటిక్, మధ్యధరా ప్రాంతాలపై శాస్త్రవేత్తలు ఎక్కువగా పరిశోధనలు జరిపారు.
వీరు ఈ పరిశోధనలకు సంబంధించి వెలువడిన 208 నివేదికలను విశ్లేషించారు. ఇందులో సముద్రాల్లో ప్రధాన ఆహారమైన ఫైటోప్లాంక్టన్‌లు భూమిమీదున్న మొక్కలతో పోలిస్తే సీజన్‌లో సరాసరి ఆరురోజులకు ముందే పుష్పిస్తున్నాయని, అలాగే చేప పిల్లలు కూడా 11 రోజులకు ముందే పుడుతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. భూతాపం కారణంగా సముద్రంలో ఉండే చేపలు, షెల్‌ఫిష్, క్రస్టాసియన్లు, ప్లాంక్టన్, మడ అడవులు, సముద్ర గడ్డి తమ సహజసిద్ధ ఆవాస ప్రాంతాలనుండి దశాబ్దానికి 72 కిలోమీటర్ల దూరం చొప్పున జరుగుతున్నాయిని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొన్ని జాతులైతే ఏకంగా 470 కిలోమీటర్ల అవతలికి వెళ్లిపోయాయట. అయితే భూమిమీద మాత్రం అలాంటి కదలికలు 6 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడం గమనార్హం. మానవులు శిలాజ ఇంధనాలు ఉపయోగించడం వల్ల భూవ్యవస్థలో పెరుగుతున్న వేడిమిలో 80 శాతాన్ని సముద్రాలే గ్రహిస్తున్నాయట. అయినాకూడా భూమితో పోలిస్తే సముద్రాలు చాలా నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. సముద్రాల విస్తృతే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.