: అవసరానికి సాయం చేసే స్మార్ట్‌ఫోన్
ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్‌ల మయంగా తయారవుతోంది. చేతిలో స్మార్ట్‌ఫోనుంటే చాలు చాలా పనులను వాటిద్వారానే చేసేయొచ్చు. అయితే ఇప్పుడు మనకు అవసరానికి సాయం చేయడానికి కూడా ఫోనుంటే చాలంటున్నారు. ఎందుకంటే మనకు సాయం చేయడానికి ఎవరూ లేని సమయంలో మనకు సాయం కావాలని బయటివారికి సూచనలను అందించి మనకు సాయం అందేలా చేయడానికి మన చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉపకరిస్తుందట. దీనికి మనం చేయాల్సిన పని ఒక కొత్త అప్లికేషన్‌ను మన ఫోన్‌లో రికార్డు చేసుకోవడమే.
సాధారణంగా ఇంట్లోనుండి బయటికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దీంతో మనం ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇంటికి వచ్చే వరకూ ఇంట్లో వారికి ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా న్యూజిల్యాండ్‌కు చెందిన బాయ్డ్ పీకాక్ అనే పారిశ్రామికవేత్త 'గెట్ హోమ్ సేఫ్' అనే పేరుతో ఒక అప్లికేషన్‌ను రూపొందించారు.
ఈ అప్లికేషన్‌ను మన స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుని తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నా ఆ ప్రదేశానికి సంబంధించిన మార్గాలు, గమ్యస్థానాలకు సంబంధించిన పూర్తి వివరాలను మన ఫోన్‌లో రికార్డు చేయాలి. అంతేకాదు ఒకవేళ మనం ప్రమాదంలో చిక్కుకుంటే అత్యవసర సమయాల్లో ఎవరికి సమాచారం ఇవ్వాలి అనే విషయానికి సంబంధించి ఆయా వ్యక్తుల ఫోన్ నంబర్లను కూడా నమోదు చేయాలి. ఇక అప్పటినుండి ఆ అప్లికేషన్ పనిచేయడం ప్రారంభమవుతుంది. మనం నిర్ణీత ప్రాంతానికి వెళుతున్నామా? లేదా? అనే విషయాన్ని జీపీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ అప్లికేషన్ సరిచూస్తుంటుంది. ఒకవేళ అనుకున్న సమయానికి చేరకుండా ఎక్కడైనా ఆగాల్సి ఉండి ఆగకపోయినా, చేరుకోవాలనుకున్న ప్రదేశానికి చేరుకోలేకపోయినా తక్షణమే ఒక అలారంను మన సంబంధీకులకు పంపిస్తుంది.
నెట్‌వర్క్ లేకుండా మన సెల్‌ఫోన్ పనిచేయకున్నా కూడా ఈ అప్లికేషన్ మనకు సంబంధించిన హెచ్చరికలను పంపిస్తుంది. ఇందుకోసం 'గెట్ హోమ్ సేఫ్' సర్వర్లు ప్రత్యేకంగా ఏర్పాటైవుంటాయి. ఈ అప్లికేషన్ మన దైనందిన జీవితంలో చక్కగా ఉపయోగపడుతుందని, సముద్రాలపై చేపలు పట్టేవారికి, ఇంకా సరదాగా ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు, సాహసక్రీడల్లో పాల్గొనేవారికి చక్కగా ఉపయోగపడుతుందని పీకాక్ చెబుతున్నారు.