: అత్తారింటికి దారేది... ఇంకేది ... 10 జనపథ్: దేవినేని ఉమా


కాంగ్రెస్ కేంద్ర మంత్రులపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన విషయం సమాచారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం 15 రోజుల ముందే ఎంపీలకు అందించినా, ప్రజలకు చెప్పకుండా పదవులకు, కాంట్రాక్టులకు బేరాలాడుకుని రాష్ట్ర పరువు ప్రతిష్ఠలను మంటగలిపారని దుయ్యబట్టారు. కేంద్ర కాంగ్రెస్ నేతలు అబద్దాలతో సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. దొంగ మాటలు చెబుతూ ఢిల్లీలో నాటకాలాడుతున్నారనీ, తక్షణం కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. లగడపాటి సుద్దులు చెబుతున్నాడని, వాటిని కట్టిపెట్టి సీమాంధ్ర ప్రజలతో మమేకమవ్వాలని అన్నారు.

పదవులకు అమ్ముడుపోయి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కేంద్ర మంత్రులు కావూరి, శీలం బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రజలతో ఆడుకుంటే వారే తగిన శాస్తి చేస్తారని గుర్తుంచుకోవాలని అన్నారు. చిరంజీవి తక్షణం పదవిని వీడకపోతే ప్రజలే గుణపాఠం నేర్పుతారని అన్నారు. "నీ కుమారుడి 'ఎవడు' సినిమా ఎందుకు వాయిదా పడిందో అందరికీ తెలుసు. ఉద్యమంలోకి రాకుంటే సినిమా ఇక రీలీజ్ చేయక్కర్లేదు" అని ఆయన హెచ్చరించారు. అలాగే చిరంజీవి తమ్ముడు నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాకు అడ్రెస్ '10 జనపథ్' సోనియా ఇల్లు అని రాసుకోవాలని సూచించారు. సినిమాలు ఆడాలంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే మీకు అంత చులకనా? అని కేంద్ర మంత్రులను దేవినేని ప్రశ్నించారు. కాంగ్రెస్ కేంద్ర మంత్రుల నాటకాలు ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ తో ఏకీభవించి చరిత్ర హీనులు కావొద్దని సూచించారు. రాష్ట్రాన్ని సాధించడం ఎలాగూ కాంగ్రెస్ నేతలకు చేతకాదు. కనుక కనీసం రాష్ట్రాన్ని విభజన కాకుండా అడ్డుకుని రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News