: సీమాంధ్ర ప్రజా హక్కుల రక్షణకు ఏ త్యాగమైనా చేస్తాం: టీడీపీ ఎంపీలు
సీమాంధ్రుల హక్కుల పరిరక్షణకు తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. నేడు రాజ్యసభ, లోక్ సభలో కార్యక్రమాలకు అడ్డుపడి తమ నిరసన తెలిపి, సభను వాయిదా వేయించిన తరువాత పార్లమెంటు ఆవరణలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దని కోరారు. చట్టసభల్లో సమైక్యాంధ్ర వాణి విన్పించడంలో ఈ రోజు టీడీపీ ఎంపీలు ముందుకొస్తే తమ వంతు సహకారం అందించేందుకు కనీసం ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా ముందుకు రాలేదని అన్నారు. అయినా సరే తాము చిత్తశుద్ధితో సీమాంధ్రుల హక్కుల కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
50 శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ లేకుండా సీమాంధ్ర ప్రాంతం ఎలా మనగలదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఉద్యమకారులకు ఓ మాట చెప్తూ, ఢిల్లీలో మరోలా నటిస్తోందని మండిపడ్డారు. ఇంకా ప్రజలను మభ్యపెట్టి మోసం చేయొద్దని కాంగ్రెస్ నేతలకు వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా వారి ఉచ్చులో పడొద్దని, తమ హక్కుల సాధనకు ఎలా ఉద్యమించాలో తమకు తెలుసని టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.