: కుంబ్లే తర్వాత జడేజానే..
భారత క్రికెట్లో యువ సంచలనం రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు సృష్టించాడు. కపిల్, మణీందర్ సింగ్, కుంబ్లే తరువాత ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన ఏకైక ఆటగాడిగా జడేజా సత్తా చాటాడు. జింబాబ్వే పర్యటన తరువాత సమీక్షించిన ర్యాంకుల్లో జడేజా నాలుగు స్థానాలు ఎగబాకి అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతను ప్రదర్శనే అతన్ని ఈ స్థానానికి చేర్చింది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 22 మ్యాచ్ లు జరిగితే అందులో 38 వికెట్లు తీసి అదరగొట్టాడు జడేజా.
ఆల్ రౌండర్ గా జట్టులో స్ధానం సంపాదించిన జడ్డూ భాయ్ బ్యాటుతో పెద్దగా రాణించకున్నా బంతితో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సెలక్షన్ కమిటీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని కెప్టెన్ ధోనీ నమ్మకాన్ని నిలబెట్టి జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలించినా, అనుకూలించక పోయినా తన సత్తా చాటాడు.
అతని అత్యుత్తమ ప్రతిభ టీట్వంటీ ప్రపంచ కప్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లో బయటపడింది. ప్రత్యర్థులతో తలపడిన ప్రతిసారి జడేజా మెరుగైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా, అత్యధిక పర్యాయాలు భారత జట్టు గెలుపు బావుటా ఎగురవేసింది. గత ఏడాదిగా జరుగుతున్న అన్ని సిరీస్ లలో జడేజా రాణిస్తుండడంతో టాప్ ర్యాంకుకు ఎగబాకాడు. సునీల్ నరైన్ తో కలిసి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు పంచుకున్నాడు. జహీర్ ఖాన్ టాప్ బౌలర్ గా రాణించినా కానీ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకోలేకపోయాడు.