: హాకీ మహిళలకు నజరానా
38 ఏళ్ళ తర్వాత ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ కు పతకం సాధించిపెట్టిన మహిళల జూనియర్ జట్టుకు నజరానా ప్రకటించారు. హాకీ ఇండియా (హెచ్ఐ) ఒక్కొక్క క్రీడాకారిణికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. భారత అమ్మాయిల జట్టు జర్మనీలోని మోన్ చెన్ గ్లాడ్ బాచ్ లో జరిగిన మహిళల జూనియర్ వరల్డ్ కప్ లో కాంస్యం సాధించింది. ప్లే ఆఫ్ లో భారత్ 3-2తో ఇంగ్లండ్ ను మట్టికరిపించింది. నిర్ణీత సమయానికి స్కోరు 1-1తో సమం కాగా, మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. కాగా, పతకం సాధించిన భారత జూనియర్ జట్టుకు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఇదో చారిత్రక ఘట్టమని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.