: అగరుబత్తితో ఆరోగ్యానికి ప్రమాదం
సాధారణంగా గదిలో సువాసనలు వెదజల్లడానికి మనం అగరువత్తులను వెలిగిస్తుంటాం. దేవుడికి అగరువత్తులను వెలిగించి దణ్నం పెట్టుకుంటుంటారుకూడా. అయితే ఇలా అగరొత్తులను వెలిగించడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్నారు పరిశోధకులు. అగరొత్తులు గదిలోని గాలిని కలుషితం చేస్తాయని, ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చడంవల్ల మన ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు అగరొత్తుల పొగపై పరిశోధన నిర్వహించారు. అగరొత్తులను వెలిగించడం వల్ల వచ్చే పొగ పలు ఆరోగ్యపరమైన సమస్యలను కలిగిస్తోందని, కన్ను, ముక్కు, గొంతుతోబాటు చర్మ సంబంధమైన సమస్యలకు కారణమవుతోందని తమ పరిశోధనలో గుర్తించారు. ఇంకా ఆస్తమా, తలనొప్పి, హృదయ నాళాలకు సంబంధించిన పలు వ్యాధులకు కూడా అగరొత్తుల పొగే కారణమని చెబుతున్నారు. అగరొత్తుల పొగ గదిలోని గాలిని కలుషితం చేస్తుంది. ఈ గాలి ఎక్కువగా గదిలో గడిపేవారిలో ఆందోళనను అధికం చేస్తుందంటున్నారు పరిశోధకులు.