: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చోరీ!
దొంగతనాల్లో ఇది పెద్దది... ఇది చిన్నది అని లెక్కలుంటాయా అంటే ఉంటాయనే చెప్పాలి. ఎందుకంటే దొంగిలించే సొమ్ము విలువనుబట్టి పెద్దదా... చిన్నదా అని చెబుతుంటారు. అయితే ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద దొంగతనం ఏదంటే... కేన్స్‌లో జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సుమారు 136 మిలియన్ డాలర్ల విలువైన వస్తువుల దొంగతనం జరిగింది.
గత వారం రోజులనుండి ఫ్రాన్స్‌లోని ఆగ్నేయ కోస్తా ప్రాంతం దొంగతనాలతో వణికిపోతోంది. సంపన్న హోటళ్లు, నగల దుకాణాలు, ప్రదర్శన శాలలు ఇలా వరుసగా దొంగలు దోపిడీ చేసేస్తున్నారు. ఈ దొంగల ముఠాను పట్టుకోవడం మాట దేవుడెరుగు... అసలు దొంగల ముఠాను అడ్డుకోవడం కూడా పోలీసుల వల్ల కావడం లేదు. శనివారం నాడు నైస్ నగరానికి సమీపంలో ఉండే జీన్ క్యాప్ ఫెరాట్ హోటల్‌లో చోరీ జరిగింది. ఈ హోటల్‌లోని మూడు గదుల్లో సుమారు 53 వేల డాలర్ల విలువైన నగలు చోరీకి గురయ్యాయి. అంతేకాదు... గత వారంలో ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన కేన్స్ నగరంలో అతిపెద్ద చోరీ జరిగింది. ఈ చోరీలో కార్ల్‌టాన్ హోటల్ ఎగ్జిబిషన్ హాలులో ప్రదర్శనకు ఉంచిన సుమారు 136 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన నగలను దొంగలు దోచేశారు. ఇప్పటివరకూ ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద నగల చోరీగా దీన్ని అధికారులు చెబుతున్నారు. బుధవారం నాడు ఇద్దరు వ్యక్తులు గ్రెనేడ్లు విసిరి కేన్స్‌లోని చేతి గడియారాల దుకాణాన్ని దోచుకుని పారిపోయారు. దోపిడీకి గురైన వాచీల విలువ 1.5 మిలియన్ యూరోలని అధికారులు చెబుతున్నారు.