: కిరణ్, గంటా, జేసీలపై కేసులు పెట్టాలి: రేవంత్ రెడ్డి
ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న సీఎం కిరణ్, మంత్రి గంటా, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డిలపై తక్షణమే కేసులు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. వెంటనే సీఎం కిరణ్ రాజీనామా చేయాలని, లేకుంటే, ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్ర నేతలతో సీఎం తన అధికారిక నివాసంలో భేటీలు జరపడం రాజ్యాంగ విరుద్ధమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్రలో ప్రజలను బుజ్జగించే క్రమంలో తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నితంగా వ్యవహరించాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఏదేమైనా, రాష్ట్రపతికి తీర్మానం పంపినప్పుడే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనట్టని తెలిపారు.