: పంజరంలో ప్రాణాలు
వారి మెడపై కత్తి వేలాడుతోంది. ఏ క్షణాన్నయినా ప్రాణం పోవచ్చు. బాహ్య ప్రపంచాన్ని చూసే.. ఇరవై రెండు సంవత్సరాలయింది. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ జీవిస్తున్న రాజీవ్ హంతకుల మనోఫలకం పరిశీలిద్దాం.
చావు అందరికీ చెప్పి రాదు..'అయితే ఏదో ఒక రోజు నన్ను నిద్రలేపి ఇవాళే చస్తావని చెపుతుంది' రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకరైన మురుగన్ మనసులోంచి వచ్చిన మాటలివి. ఇంకా వారి గుండెలోతుల్లోకి తొంగి చూస్తే..ఒకవేళ ఉరిశిక్ష తప్పితే పర్వత లోయల్లో కొంత భూమిలో వ్యవసాయం చేసి..వంద రకాల పూల మొక్కలు..ఔషధీయ మొక్కలను పెంచుతానని మురుగన్ తన ఊహాలోకాన్ని చెప్పారు. జైలులోని తన దైనందిన జీవితంలో అమ్మన్ పూజను మురుగన్ భాగంగా చేసుకున్నారు.
మన వ్యవస్థ చేత బాధితుల్లో తాను ఒకడినని... తనలాంటి ఖైదీలు ఎంతో మంది ఈ ప్రపంచంలో ఉన్నారని ఈ కేసులో మరో నేరస్తుడు పెరారివరన్ అన్నారు. పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కోవడమే ఇందుకు కారణమని అతను అన్నారు. ఎంసీఎ చదివిన పెరారివలన్..ప్రస్తుతం కంప్యూటర్ నెట్ వర్కింగ్ లో ఎంఫిల్ చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట తన చెల్లిని వెల్లూరు జైలు దగ్గరలో ఉన్న కాలేజీలో దింపేవాడినని, ఎప్పుడూ ఈ జైలులో ఉండాల్సొస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి చేతి వంట రుచి చూసే భాగ్యం తనకు లేకపోయిందని అతను అన్నారు.
జైలులోని సాయిబాబా మందిరంలో ఆధ్మాత్మికతలో కాలం వెళ్లదీస్తున్నారు మరో నేరస్థుడు సంతనన్..బాహ్య ప్రపంచం కంటే ఇక్కడే ఎటువంటి భేషజాలు లేవని సంతనన్ అంటున్నారు.
ఈ కేసులో మరో నేరస్తురాలు తన భార్య నళిని ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదని మురుగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు కసబ్, అఫ్జల్ గురు మరణశిక్ష తర్వాత తమ వంతేనని వారి కళ్లలోని భయం స్పష్టం చేస్తోంది.