: మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి (80)ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మూడు నెలల క్రితం ఆయనకు గుండెపోటు రావటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడురు ఉప్పునూతల స్వస్థలం. బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో ఆయన మంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు శాసనమండలి సభ్యుడిగా, రెండు పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా, ఏపీఐఐసీకి ఛైర్మన్ గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఛైర్మన్ గా పనిచేశారు. సుధీర్ఘకాలంపాటు కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన ఇటీవల వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.