: నేపాల్లో పులుల సంఖ్య పెరిగింది
నేపాల్లో పులుల సంఖ్య పెరిగింది. ఆ దేశంలో పులుల సంరక్షణకు పాటుపడుతున్న కన్జర్వేషనిస్టులు ఈ విషయంలో పండగ చేసుకుంటున్నారు. నేపాల్లో రాయల్ బెంగాల్ పులుల సంఖ్య ప్రస్తుతం 198 కి పెరిగిందిట. గత అయిదేళ్ల గణాంకాలతో పోల్చిచూసినప్పుడు ఇది 63.6 శాతం పెరుగుదల. ప్రభుత్వం చేయించిన ఒక సర్వే ఈ గణాంకాలను వెల్లడిస్తోంది.
అపాయంలో ఉన్న రాయల్ బెంగాల్ పులుల జాతి అంతరించిపోకుండా కాపాడడంలో ఈ గణాంకాలు, ఫలితాలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని కన్జర్వేషనిస్టులు భావిస్తున్నారు. పులులను ఆకర్షణీయమైన వాటి చర్మం, గోర్లు తదితరాల కోసం వేటాడి స్మగ్లింగ్ చేసేవారు పెరగడం వల్ల అవి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతూ ఉన్నాయి. జనావాసాలు అడవుల్లోకి చొచ్చుకు వస్తుండడం వల్ల కూడా ఇవి క్రమంగా అంతరించిపోతున్నాయనే ప్రచారం ఉంది. ఇప్పుడు అనేక ప్రయత్నాల ఫలితంగా పులుల సంఖ్య పెరిగే పరిస్థితి వచ్చిందని పలువురు అంటున్నారు.