: 41 నిమిషాల్లో ఐఏఎస్ నే బదిలీ చేయించా: యూపీ మంత్రి వ్యాఖ్య


కేవలం 41 నిమిషాల్లో ఐఏఎస్ అధికారిని బదిలీ చేయించానని ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు తన సన్నిహితులతో గొప్పగా చెప్పుకున్నాడు. అది కాస్తా ఒకరు వీడియో తీయడం, అది బయటపడడంతో అక్కడ వివాదం చెలరేగింది. గత వారం రోజులుగా దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారిన దుర్గాశక్తి నాగపాల్ గురించే ఈ మంత్రి వ్యాఖ్యానించాడు. నరేంద్ర బాటి అనే మంత్రికి ఆ అధికారిణి మీద ఎందుకు కోపమొచ్చిందో తెలియదు కానీ తలచుకున్నదే తడవుగా తండ్రీ కొడుకులు ములాయం అఖిలేష్ లకు ఫోన్ చేశారు. నేను 10.30 కి ఫోన్ చేశాను. 11.11 కల్లా ఆమె బదిలీ అయిపోయింది తెలుసా? అంటూ నరేంద్ర బాటి చెప్పడం వీడియోలో రికార్డయింది.

దుర్గాశక్తి నాగపాల్ ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపారు. ఈమె ఐఏఎస్ గా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత యూపీలో రాజకీయనాయకులకు కంట్లో నలుసులా తయారయ్యారు. దీంతో ఆమెను బదిలీ చేశారు. బదిలీ కాగానే ఆమె ముందుకు వివాదాస్పద దేవాలయ భూ వివాద దస్త్రం తీసుకొచ్చారు. ఆమె రూల్స్ ప్రకారం దేవాలయాన్ని కూల్చి ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాన్ని కూల్చడంతో వివాదం రేగిందని ఆమెను సస్పెండ్ చేసింది యూపీ ప్రభుత్వం. దీంతో ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పీల్ చేసింది. అయినా సరే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వివాదం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. దీంతో ఈ వీడియో బయటపడడం అఖిలేష్ యాదవ్ తలకు చుట్టుకుంది.

  • Loading...

More Telugu News