: సీఎం, పీసీసీ చీఫ్ రాజీనామాలేవి?: గాలి
కాంగ్రెస్ పార్టీ రాజీనామాలంటూ మరో నాటకానికి తెరతీసిందని టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతి రాజు ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేస్తుంటే మరి ఆ ప్రాంత ప్రయోజనాలమీద సీఎం, పీసీసీ చీఫ్ లకు చిత్తశుద్ది లేదా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ కేంద్రం తరపున కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రకటించడం పట్ల టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ కేంద్రంలో ఏ పదవిలో ఉన్నాడో తెలియదని, కానీ అన్నీ తానై మాట్లాడుతున్నాడని ఆక్షేపించారు.
దిగ్విజయ్.. ఒంగోలు, కర్నూలు వంటి మహానగరాలు ఉన్నాయని వేళాకోళంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఐఐటీ వేసిన లెక్కల్ని ప్రామాణికంగా తీసుకుని రాజధాని నిర్మాణానికి అయ్యే లెక్క చెబితే దిగ్విజయ్ అధికార మదంతో మాట్లాడుతున్నాడని విమర్శిచారు. విభజన ముందు రోజు సోనియాను, దిగ్విజయ్ ను కలిసి, వారి షరతులకు ఒప్పుకున్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి వచ్చి వారి అనుమతితోనే నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ప్రజల్ని మభ్యపెడుతూ తప్పుదోవ పట్టించేందుకు, కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆగ్రహంతో రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయంతోనే రాజీనామా బాట పడుతున్నారని ఆరోపించారు.
రాజధాని నిర్మాణం ఎలా అన్నది తేల్చాలని, అంత పెద్ద మొత్తాన్ని ఎవరు భరిస్తారో తేల్చాలన్నారు. అలాగే ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎలా కల్పిస్తారో స్పష్టం చేయాలని అన్నారు. గతంలో విభజించిన రాష్ట్రాల విషయంలో కేంద్రం మాట తప్పిందని, మళ్లీ ఆ తరహా చేదు అనుభవం తమకు ఎదరుకాకూడదనే ప్రజలు ఆందోళన బాటపట్టారని గాలి, అశోక్ గజపతి రాజులు తెలిపారు. తమ ప్రాంత ప్రజల హక్కుల సాధన కోసమే రాజీనామా చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.