: తెలంగాణలో ప్రభుత్వోద్యోగాలు చేస్తున్న ఆంధ్రులు వెళ్ళాల్సిందే: కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నైజాన్ని మరోమారు చాటుకున్నారు. తెలంగాణ సాకారమైతే ఆంధ్రులు తట్టాబుట్టా సర్దుకోవాల్సి ఉంటుందని ఇంతకుముందోసారి వ్యాఖ్యానించిన ఈ గులాబీ బాస్ నేడూ అలాంటి వ్యాఖ్యలే చేసి విద్వేషాలను ఎగదోసే ప్రయత్నం చేశారు. నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్రులు తమతమ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఆ ఉద్యోగాలను తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెబుతూ, వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.