: షిండే.. గుండు గీయించి పంపుతాం: నన్నపనేని
రాష్ట్ర విభజన వేడితో నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి, వ్యాఖ్యలు పదునెక్కుతున్నాయి. తాజాగా, తెలుగుదేశం పార్టీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర పరిస్థితులపై నింపాదిగా ఢిల్లీలో కూర్చుని వ్యాఖ్యానిస్తున్న షిండే గనుక సీమాంధ్రలో పర్యటిస్తే తప్పక ఆయనకు గుండు గీయించి పంపుతామని హెచ్చరించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో నన్నపనేని ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, విదేశీ వనిత అయిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. దిగ్విజయ్ ను పరిశీలకుడిగా నియమిస్తే ఏ రాష్ట్రం పరిస్థితైనా ఇంతే అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ చేతులెత్తేయడమే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.