: సీపీఎం, ఎంఐఎం మాత్రమే తెలంగాణను వ్యతిరేకించాయి: బొత్స


రాజకీయ పార్టీల తీరు బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు చెప్పాయన్నారు. ప్రజల మనోభావాలని, ఆలోచనలను తేల్చిచెప్పేవి రాజకీయ పార్టీలే అని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో 31శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ సాధించిందన్నారు. మిగిలిన 59 శాతం ఓట్లు సాధించిన పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలమనేనంటూ నివేదికలిచ్చాయని బొత్స అన్నారు. రాజకీయ లబ్దికోసం అప్పడు మాట్లాడిన పార్టీలన్నీ, ఇప్పడు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంలంతా తెలంగాణ వెనుకబడిందని చెప్పారని అన్నారు. అన్ని ప్రాంతాలు, నాయకులు కలిసి హైదరాబాద్ ను గుండెగా తయారు చేశారన్నారు. అయినా, రాజకీయపార్టీల అవసరాల కోసం అందరూ ఈ ప్రాంతం వెనుకబడిందని ప్రత్యేక అవకాశాలు కల్పించాలన్నారు. 50 ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో ఉత్తరాంధ్ర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాలు అభివృద్ధికి ఇంకా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలన్నీ విభజన మకిలిని కాంగ్రెస్ మీదకు తోసేస్తున్నాయని బాధపడ్డారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నెహ్రూ విగ్రహాన్ని కూల్చడం న్యాయమా? అని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న ఇందిరా గాంధీ విగ్రహాన్ని కూల్చడం దారుణమన్నారు.

కేవలం సీపీఎం, ఎంఐఎం మాత్రమే తెలంగాణను వ్యతిరేకించాయని బొత్స తెలిపారు. స్వార్ధం కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. వెనుకబడిన ప్రాంతానికి చెందిన నేతగా నేను కూడా ఆ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తానన్నారు. కొసమెరుపేంటంటే, ఆయన తెలంగాణను బలపరిచారో, సమైక్యవాదాన్ని బలపరిచారో ఎవరికీ అర్థం కాలేదు.

  • Loading...

More Telugu News