: సినిమా షూటింగుల కోసమే ఓ రైల్వే స్టేషన్
షూటింగుల కోసం రైల్వే స్టేషన్ పరిసరాలు, రైళ్లను కేటాయించాలని కోరుతూ వినతులు పెరిగిపోతుండడంతో సెంట్రల్ రైల్వే ఒక చక్కటి ఐడియాను ఆచరణలో పెడుతోంది. చలనచిత్ర యూనిట్లకు అద్దెకివ్వడం కోసమే ప్రత్యేకంగా ఒక రైల్వే స్టేషన్ ను నిర్మించే ఆలోచనలో ఉంది. ఈ ఆలోచన ప్రారంభ దశలోనే ఉందని, ముంబైలోని మాతుంగ వర్క్ షాప్, వాడి బంద్ర లేదా కుర్ల కార్ షెడ్ లను ఇందుకు వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి అతుల్ రాణే చెప్పారు. వీటిలో ఇప్పటికే ప్లాట్ ఫామ్, రైల్వే ట్రాకులు ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల నిర్మాణ సంస్థలు తమ రైలు సన్నివేశాలను ఒకే చోట తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ రైల్వేకి చిత్ర నిర్మాణ సంస్థల నుంచి కోటి రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే 91 లక్షల రూపాయలు రావడం విశేషం. అందుకే ముందు ముందు మరింత డిమాండ్ వస్తుందనే అంచనాతో ప్రత్యేకంగా ఒక స్టేషన్ ను నిర్మించాలని సెంట్రల్ రైల్వే యోచన.