: మీడియాకు కత్రినా కైఫ్ బహిరంగ లేఖ
ఓ వర్గం మీడియా తన వ్యక్తిగత విషయాల్లోకి దూరి తనకు, హీరో రణ్ బీర్ కపూర్ కు సంబంధించిన ఫోటోలను ప్రచురించడం పట్ల బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆమె మీడియాకు ఓ బహిరంగ లేఖ రాసింది. తను, రణ్ బీర్ కలిసి ఉన్న ఫోటోలు ఓ ఫిల్మ్ మ్యాగజైన్ (స్టార్ డస్ట్) లో రావడంపై తాను తీవ్రంగా బాధపడుతున్నానని తెలిపింది. తాను, వేరొకరితో స్పెయిన్ హాలిడ్ టూర్ లో ఉన్నప్పుడు ఎవరో తమ అనుమతి లేకుండా తీసిన వాటిని కమర్షియల్ గా ఉపయోగించుకునేందుకే ఇలా చేశారని విమర్శించింది.
ఇలా చేయడం ఓ రకమైన జర్నలిజమ్ కు సాక్ష్యంగా ఉన్నాయని, హద్దులు దాటి ఇతరుల స్వంత విషయాల్లోకి దూరి, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారనడానికి నిదర్శనమిదేనని మండిపడింది. దయచేసి ఆ ఫోటోలను పదేపదే చూపకుండా ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. తనకు మీడియాతో మంచి రిలేషన్ ఉందని, అన్ని సమయాల్లో తాను మీడియాకు అందుబాటులో ఉంటానని, ఆ ఫోటోల వెనక ఎలాంటి కారణం లేదని పేర్కొంది.
స్పెయిన్ టూర్ కు వెళ్లిన కత్రినా, రణ్ బీర్ అక్కడి ఇబిజా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను గతవారం పాప్యులర్ ఫిల్మ్ మ్యాగజైన్ స్టార్ డస్ట్ ప్రచురించింది. అవే ఫోటోలు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పలు పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. ఈ ఫోటోలతో వీరిద్దరి మధ్య ప్రేమ నిజమేనని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇవేనంటూ కొన్ని ఛానళ్లు కథనాలు సైతం ప్రసారం చేశాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఫోటోలపై బాలీవుడ్ కంగుతిన్నది. అటు ఈ విషయంపై రిషి కపూర్, నీతూ కూడా కొడుకు రణ్ బీర్ పై మండిపడ్డట్లు సమాచారం.