: శ్రీనివాసన్ బీసీసీఐ పగ్గాలందుకున్నారు: సంజయ్ పటేల్
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ తిరిగి పగ్గాలు స్వీకరించారని, ఆయన తన పనిని ప్రారంభించారని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. ఈ రోజు జరిగే బోర్డు సమావేశానికి శ్రీనివాసనే అధ్యక్షత వహిస్తారని చెప్పారు. శ్రీనివాసన్ రాజీనామా చేయాలని ఇప్పటి వరకూ ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు. అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ కావడంతో, శ్రీనివాసన్ తాత్కాలికంగా బీసీసీఐ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కు పాల్పడినట్లుగా మెయ్యప్పన్, రాజ్ కుంద్రాలపై ఎలాంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ చట్ట విరుద్ధమని, తిరిగి మళ్లీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు జరిగే బోర్డు సమావేశంలో శ్రీనివాసన్ భవితవ్యంపై స్పష్టత రానుంది.