: శ్రీనివాసన్ వ్యవహారంలో డబ్బు ఆఫర్ చేశారు : బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి
బీహార్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిత్య వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ దర్యాప్తు కమిటీపై పిల్ ను కోర్టు బయటే పరిష్కరించుకుందామని, అందుకు తనకు కొంత మొత్తాన్ని ముట్టజెబుతామంటూ ఓ వ్యక్తి తనకు ఫోన్ చేశాడని చెప్పారు. బీసీసీఐ దర్యాప్తు కమిటీ అక్రమం, చట్టవిరుద్ధమంటూ కొన్ని రోజుల కిందట వర్మ బాంబే హైకోర్టులో పిల్ (వ్యాజ్యం) వేశారు. దీనిపై కోర్టు విచారణ కూడా చేసింది.
దీనిపై వర్మ మాట్లాడుతూ.. 'గతవారం తెలియని వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చింది. చెన్నై వచ్చి తన బాస్ ను కలవాలని చెప్పాడు. నీకేం కావాలో వచ్చి అడుగు' అని తనతో అన్నట్లు తెలిపారు. పిల్ పై కోర్టు విచారణ తర్వాత కూడా మళ్లీ కొంతమంది అపరిచిత వ్యక్తులను తాను కలిశానని, వాళ్లు తనకు డబ్బు ఇవ్వజూపి కేసును సెటిల్ చేసుకుందామంటూ అడిగారని వివరించారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు.