: హోటల్లో భోజనానికి డబ్బుల్లేని జింబాబ్వే జట్టు


భారత్ అండర్ 10 క్రికెట్ జట్టు కూడా పడని కష్టాలను జింబాబ్వే క్రికెట్ జట్టు పడుతోంది. కనీసం హోటల్లో మూడుపూటలు భోజనం చేసేందుకు కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతోంది. మూడో వన్డే గెలిచి సిరీస్ చేజిక్కించుకున్న ఆనందంలో భారత జట్టు హోటల్లో సంబరాలు చేసుకుంటుంటే, జింబాబ్వే జట్టు హోటల్ బిల్లు పెరిగిపోతుందని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మాట్లాడుకుని బులవాయో చేరుకోవడానికి సిద్దమైంది. హోటల్లో భోజనం మూడు పూటలూ చేస్తే బిల్లు పెరుగుతుందని స్టేడియంలో ఏర్పాటు చేసిన బఫే భోజనానికి మూడు పూటలూ జింబాబ్వే జట్టు వెళ్లి వచ్చేది. మన కోహ్లీకి 1,86,000 డాలర్లు ఏడాదికి కాంట్రాక్టు ఫీజుగా బీసీసీఐ చెల్లిస్తుండగా, జింబాబ్వే ఏ క్లాస్ ఆటగాడిగా బ్రెండన్ టేలర్ కి దక్కేది కేవలం 6,000 డాలర్లు.

దీనిపై జింబాబ్వే వెటరన్ దిగ్గజఆటగాడు, తాజా జట్టుకు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ స్పందిస్తూ.. జింబాబ్వే ఆటగాళ్ల ఇబ్బందులు నిజమేనన్నాడు. అలాగే జింబాబ్వే జట్టు అవసాన దశలో ఉందని అన్నాడు. ఎప్పటికి తమ బోర్డు కోలుకుంటుందో తెలీదని, కోలుకుంటుందనే ఆశకూడా లేదని తెలిపాడు. అదే జరిగితే రికార్డుల్లో తమ జట్టుండేదని చూసుకోవడమే తప్ప తమ జట్టు నిలబడగలిగే పరిస్థితి లేదని అన్నాడు. గతంలో ఆటగాళ్ల మధ్య జరిగిన జాత్యహంకార గొడవలతో జింబాబ్వే బోర్డు పరువు ప్రతిష్ఠలు కోల్పోయింది.

ఆటగాళ్లకు కాంట్రాక్టుల వివాదం, బోర్డులకు చెల్లించాల్సిన బకాయిలు పెరగడం, ఐసీసీ సహాయం చేయకపోవడంతో జింబాబ్వే బోర్డు నిండా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆ జట్టు, బోర్డు పతనం అంచున నిలబడినట్టయింది. కాగా మన జట్టులో ఆటగాడు ఒక రోజు వన్డే ఆడినందుకు ముట్టజెప్పే ఫీజు వెయ్యి డాలర్లు, అదనంగా అలవెన్సు కింద 80 డాలర్లు కూడా అందుకుంటారు. అదే జింబాబ్వే ఆటగాడి ఏడాది సంపాదన మన ఆటగాడి నాలుగు వన్డేల సంపాదన కావడం దారుణం.

  • Loading...

More Telugu News