: ముమ్మాటికీ ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగే : సోమిరెడ్డి
తెలంగాణ అంశంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని తాజా పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో బలోపేతం కావడం కోసమే కాంగ్రెస్, టీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సీడబ్ల్యూసీ భేటీ ముగిసిన వెంటనే నిర్ఱయం వెలిబుచ్చిన కాంగ్రెస్.. మరికొద్దిసేపటికే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం గురించి మాట్లాడడం చూస్తుంటే.. రెండూ లోపాయికారి ఒప్పందానికి వచ్చి ఉంటాయని అర్థమవుతోందన్నారు. హైదరాబాదుపై స్పష్టత కావాలని కేసీఆర్ రాత్రి 11 గంటలకు డిమాండ్ చేస్తే, నేటి ఉదయం 10 గంటల కల్లా దిగ్విజయ్ సింగ్ స్పష్టత ఇచ్చాడని ఆయన వివరించారు.
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించడంపై మరింత క్లారిటీ కావాలని కేసీఆర్ కోరడంపై సోమిరెడ్డి మండిపడ్డారు. యాభై, అరవై ఏళ్ళుగా సీమాంధ్రుల శ్రమతో హైదరాబాదు అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎవరో వచ్చి ఈ ఫలాలను అందుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తెలంగాణను పునర్నిర్మిస్తామంటున్న కేసీఆర్, హైదరాబాదును కూల్చివేసి మళ్ళీ నిర్మిస్తారా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ చెప్పినట్టు దేశ రెండో రాజధానిగా హైదరాబాదును మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని సోమిరెడ్డి గుర్తు చేశారు.