: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దామోదర?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ మరో ఐదారు నెలల్లో ముగిసిపోతుందని ఏఐసీసీ నేతలు గులాంనబీ అజాద్, దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేయడంతో.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. ఐదారు నెలల్లో రెండు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయనుకుంటే.. అది కాంగ్రెస్ సారథ్యంలోనే అన్నది తెలిసిందే. రెండు చోట్లా కాంగ్రెస్ కే మెజారిటీ ఉంది. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు నిర్ణీత సంఖ్య కంటే ఐదారుగురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. ఎంఐఎం లేదా కేసీఆర్ ఎవరో ఒకరు మద్దతు ఇవ్వవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. నిన్న రాత్రి విభజనకు ఆమోదం తెలుపుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించిన తర్వాత కూడా కేసీఆర్ ఇదే మాట చెప్పారు. పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందాక విలీనంపై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తాను మాటపై నిలబడే రకమని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడే లోపే టీఆర్ఎస్.. కాంగ్రెస్ లో విలీనమయ్యే ప్రక్రియ ముగిసిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ విలీనం సాకారం కాకపోయినా రాష్ట్రాన్ని విభజించినందుకు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వవచ్చని అంటున్నారు.

తెలంగాణకు దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కేసీఆర్ మొదటి నుంచీ చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఆయన దళిత వర్గానికి చెందినవారే. దీంతో ముఖ్యమంత్రిగా రాజనరసింహ అభ్యర్థిత్వానికి కేసీఆర్ ఆమోదం తెలుపవచ్చని భావిస్తున్నారు. దీని ద్వారా ఆయన అన్న మాట కూడా నిలబెట్టుకున్నట్లవుతుంది. పైగా రాజనరసింహ వివాద రహితుడు, గ్రూపులు కట్టే వ్యక్తి కాదు. ఉన్నత విద్యావంతుడు. దీంతో ఎన్నికలకు కొన్ని నెలలు ముందుగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాజనరసింహకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

  • Loading...

More Telugu News