: గూర్ఖాలాండ్ విషయంలో కేంద్రం కుట్ర: మమత మండిపాటు
తెలంగాణ ఉద్యమాన్ని గూర్ఖాలాండ్ తో కలిపి చూడరాదని, పశ్చిమబెంగాల్ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు 'ఢిల్లీ' ఎందుకు విఘాతం కలిగిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని గూర్ఖాలాండ్ తో కలిపి చూడరాదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు మొదలు కావడంతో డార్జిలింగ్ లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. గూర్ఖాలాండ్ ప్రాదేశిక మండలికి అధ్యక్షుడిగా ఉన్న బిమల్ గురుంగ్ రాజీనామా చేసి 72 గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పుడది కొనసాగుతోంది. అసలు ప్రత్యేక గుర్ఖాలాండ్ ఉద్యమాన్ని కాంగ్రెస్సే ప్రోత్సహిస్తోందని మమత అనుమానం వ్యక్తం చేశారు.
డార్జిలింగ్ ప్రాంతం పశ్చిమబెంగాల్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. తామంతా సమైక్యంగా ఉన్నామని, ఏదైనా రాజకీయ పార్టీ, కేంద్ర ప్రభుత్వం విభజించడానికి కుట్ర పన్నితే.. డార్జిలింగ్, పశ్చిమబెంగాల్ ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక ఉద్యమాన్ని సమసిపోయేలా చేసే ప్రయత్నంలో భాగంగానే.. మమత ముఖ్యమంత్రి అయ్యాక, డార్జిలింగ్ కేంద్రంగా గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనా మండలిని ప్రకటించారు.