: మూత్రంతో ఎన్నెన్ని లాభాలు ఉంటాయంటే..
మూత్రం వలన ఉపయోగాలు అంటే ఏమిటి? స్వర్గీయ ప్రధాని మొరార్జీ మాటలు ఆలకించిన వారికి స్వమూత్ర సేవనం స్వస్థత కలిగిస్తుంది అని మాత్రం తెలుస్తుంది. అదే చైనా వాళ్లయితే మూత్రం నుంచి దాని యజమానికి సరిపడా దంతాలను (పళ్లను) తయారుచేయవచ్చునని చెబుతారు. ఎందుకంటే ఆ దేశంలో తాజాగా జరిగిన పరిశోధనల్లో ఇలాంటి ఒక వైద్యవిధానాన్ని అభివృద్ధి చేశారు. దంతాలను కోల్పోయిన వారికి కణజాలాలను ఉపయోగించి వాటి స్థానంలో కృత్రిమ దంతాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. అయితే మూత్రం నుంచి సేకరించిన మూలకణాలను మార్పిడి చేయడం ద్వారా పాలపళ్ల సృష్టి సాధ్యం అని ఎలుకల మీద జరిపిన పరిశోధనలు వారికి సత్ఫలితాలు ఇచ్చాయి.
గైంజౌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో మెడిసిన్ అండ్ హెల్త్ సంస్థ పరిశోధకులు ఈ పరిశోధనలో విజయం సాధించారు. ఇలా సేకరించిన కణాలను ఎలుకనుంచి సేకరించిన వాటితో కలిపి జంతువుల్లోకి ఎక్కించినప్పుడు.. మూడు వారాల్లో ఈ కణాలు కలిపి దంతాకారంలోకి మారినట్లు వారు చెబుతున్నారు. సహజదంతమంత దృఢంగా ఉండకపోవచ్చుగానీ.. మరిన్ని పరిశోధనలకు ఇది అవకాశం ఇస్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.