: నిధులు ఉపయోగించుకోవడంలో 161 మంది ఎంపీలు విఫలం
ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవడంలో ఎంపీలు విఫలమయ్యారు. ప్రధానంగా 15వ లోక్ సభ కాలంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఆర్ జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ సహా 161 మంది ఎంపీలు ఫెయిల్ అయ్యారు. పలువురు బీజేపీ నేతలతో పాటు షానావాజ్ హుస్సేన్, మేనకా గాంధీ, రాజ్ నాథ్ సింగ్, యూనియన్ మినిస్టర్ వి.నారాయణ స్వామి, శ్రీ ప్రకాశ్ జైస్వాల్, హరీష్ రావత్, ఆర్ జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, జనతాదళ్ నేత శరద్ యాదవ్ పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి.
కర్ణాటకలోని బళ్లారి బీజేపీ ఎంపీ జె.శాంతా అత్యంత దారుణంగా 23.78 శాతం నిధులు ఖర్చు పెడుతుండగా, దక్షిణ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రమేష్ కుమార్, జనతా దళ్ (యు) నేత రాజివ్ రాంజన్ లు 27.29 శాతం, 28.53 శాతం నిధులు ఖర్చు పెట్టి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రతి ఆర్ధిక సంవత్సరంలో ప్రతి ఎంపీ తమ ప్రాంత అభివృద్ధికోసం జిల్లా అధికారులకు నిధులను శాంక్షన్ చేయాలి. కానీ, అలాంటి పనులేవి జరగలేదని తెలుస్తోంది. ఎంపీ లాడ్స్ కింద ప్రతి ఏడాది కేటాయించే నిధుల్లో ఒక్కో ఎంపీ 75 శాతం ఖర్చుపెట్టాలి. అంతకుముందు రెండు కోట్లు ఉన్న నిధులు, 2011లో ఐదు కోట్లకు పెరిగాయి. వీటిని తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వినియోగించడంలో గౌరవనీయులైన ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి.