: కర్ణాటకలో బ్రాహ్మణులకు రిజర్వేషన్ల గాలం!


కర్ణాటకలో బ్రాహ్మణుల సమస్యలపై సిద్ధరామయ్య నేతృత్వంలోని నూతన కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా రిజర్వేషన్లు కల్పించే యోచనలో ఉంది. ఇది రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమకు ఎంతో లాభిస్తుందని అక్కడి కాంగ్రెస్ సర్కారు భావన. కర్ణాటక రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణుల సంఖ్య 5 శాతం వరకూ ఉంది. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. రిజర్వేషన్ల ద్వారా బ్రాహ్మణులకు గాలం వేయడంతోపాటు.. అదే సమయంలో వారిని బీజేపీకి దూరం చేయాలన్నది సిద్ధరామయ్య సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది.

బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక స్థితిపై అధ్యయనం చేసేందుకు కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ తెలిపారు. ఇళ్లు, విద్యకు సంబంధించి ఈ వర్గం వారికి స్కీములను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

మరోవైపు, బెంగళూరు, ఉత్తర కన్నడ జిల్లాలలో బ్రాహ్మణుల సంఖ్య గణనీయంగా ఉన్నందున ఆ వర్గం వారికి 4 లోక్ సభ స్థానాలు, 35 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం వల్ల విజయం సునాయాసం అవుతుందని ఒక కాంగ్రెస్ ఎంపీ అన్నారు. అదే సమయంలో దళితులు, బీసీలను కూడా దరిచేర్చుకుని ఉత్తరప్రదేశ్ లో మాయావతి వ్యూహం వలే కన్నడనాట మరింతగా పాతుకు పోవాలని కాంగ్రెస్ వ్యూహంగా ఉంది.

  • Loading...

More Telugu News