: గ్యాస్ ధర పెంపుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు


స్వదేశీ గ్యాస్ ఉత్పత్తి ధరను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్వదేశీ గ్యాస్ ఉత్పత్తి ధరను 'మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) కు ప్రస్తుతం 4.2 డాలర్లు ఉండగా 2014 ఏప్రిల్ నుంచి 8.4 డాలర్లకు పెంచుతూ ప్రధాని అధ్యక్షతన కేబినెట్ వ్యవహారాల ఆర్థిక కమిటీ గత నెలలో నిర్ణయం తీసుకుంది. దీనిపై సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్ గుప్తా ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ సదాశివం అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం విచారించింది.

గ్యాస్ ధర పెంచే విషయంలో విద్యుత్, ఎరువుల రంగాలపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని దాస్ గుప్తా కోర్టు దృష్టికి తెచ్చారు. ఐదుగురు కేబినెట్ మంత్రులు వ్యతిరేకించినా ధరను పెంచారని తెలిపారు. కేజీ బేసిన్ లో రిలయన్స్ ఆధ్వర్యంలో వినియోగించకుండా ఉన్న క్షేత్రాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. దీంతో, వివరణ తెలియజేయాలని కోరుతూ కేంద్రానికి, రిలయన్స్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News