: దిల్షాన్ శతకం.. సిరీస్ లంక కైవసం
విధ్వంసక బ్యాట్స్ మన్ తిలకరత్నే దిల్షాన్ వీరోచిత శతకం... కుమార సంగక్కర సూపర్ ఫిఫ్టీ.. వెరసి దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ శ్రీలంక వశమైంది. పల్లెకెలెలో జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య లంక 8 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ను 3-1తో మరో వన్డే మిగిలుండగానే చేజక్కించుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో డుమినీ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. స్టార్ బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా 77 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ అజంత మెండిస్ 4, యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ 3 వికెట్లతో పర్యాటక జట్టును కకావికలం చేశారు.
ఇక కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలో దిగిన లంక జట్టుకు దిల్షాన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. 16 ఫోర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దిల్షాన్ కు మాజీ కెప్టెన్ సంగక్కర (91) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 184 పరుగులు జోడించడంతో లంక విజయం ఖరారైంది. కాగా, ఇరుజట్ల మధ్య చివరి వన్డే ఎల్లుండి కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.