: శ్రీనివాసన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ కమిటీ
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ అధ్యక్ష విధుల నుంచి తాత్కాలికంగా పక్కకు తప్పుకున్న శ్రీనివాసన్ మళ్లీ బాధ్యతలు చేపట్టడానికి లైన్ క్లియర్ అయింది. ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ దొరికిపోయిన తర్వాత, ఇదే కేసులో శ్రీనివాసన్ మేనల్లుడు, చెన్నై సూపర్ కింగ్ జట్టు సీఈఓ గురునాథ్ మెయ్యప్పన్ పాత్ర ఉందని ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సొంత జట్టు రాజస్థాన్ రాయల్స్ పైనే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పందేలు కాసినట్లు ఢిల్లీ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీంతో బీసీసీఐ సొంతంగా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీపై ప్రభావం పడరాదనే ఉద్దేశంతో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకుని ఆ బాధ్యతలను అనుయాయుడు జగ్మోహన్ దాల్మియాకు అప్పగించారు.
తాజాగా విచారణ ముగించిన ఇద్దరు సభ్యుల బీసీసీఐ కమిటీ.. శ్రీనివాసన్, మెయ్యప్పన్, రాజ్ కుంద్రా బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని నిగ్గు తేల్చింది. ఈమేరకు తన నివేదికను బీసీసీఐకి సమర్పించింది. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు నిరంజన్ షా మాట్లాడుతూ.. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కమిటీ తేల్చినట్లు చెప్పారు. ఈ నివేదికపై ఆగస్టు 2న జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలోనే శ్రీనివాసన్ మళ్లీ పగ్గాలు చేపట్టడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ లపై విచారణ ఇంకా ముగియలేదని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు దాల్మియా చెప్పారు.