: 7 వికెట్లతో మూడో వన్డే గెలిచిన టీమిండియా.. సిరీస్ భారత్ వశం
టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పినట్టే చేసి చూపించాడు. మరో రెండు వన్డేలు ఉండగానే సిరీస్ ను స్వంతం చేసుకుని భారత జట్టు సత్తా చాటింది. కెప్టెన్ కోహ్లీ గేమ్ ప్లాన్ ను అమలు చేసిన బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కేవలం 183 పరుగులకే జింబాబ్వేను కుప్పకూల్చారు. అనంతరం 184 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు కేవలం 35.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్(14) మరోసారి విఫలమవ్వగా, ధావన్(35) కాస్త ఫర్వాలేదనిపించాడు. అనంతరం క్రీజులోకొచ్చిన కోహ్లీ(68), రాయుడు(33) రాణించారు. చివర్లో రాయుడు అవుటవ్వడంతో కెప్టెన్ రైనా(28)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు.
నాలుగు వికెట్లు తీసి, జింబాబ్వే బ్యాటింగ్ పతనాన్ని శాసించిన మిశ్రా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు. దీంతో 5 వన్డేల సిరీస్ లో 3 గెలిచిన భారత జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. దీంతో మిగిలిన రెండు మ్యాచ్ లు నామమాత్రంగా మారాయి. అయినప్పటికీ మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేస్తామని కోహ్లీ చెబుతున్నాడు.