: '5, 12 రూపాయల భోజనం చేసి వారిద్దరూ జీవించి చూపాలి'
వెటరన్ సినీ నటుడు, కాంగ్రెస్ ఎంపీ రాజ్ బబ్బర్ 5 రూపాయలకే ముంబైలో భోజనం, రషీద్ మసూద్ చేసిన 12 రూపాయలకే ఢిల్లీలో తినగలిగినంత భోజనం వ్యాఖ్యల వివాదం రగులుతూనే ఉంది. అధికార పార్టీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు పేదలకు తక్షణం క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పేదలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని బీజేపీ, సీపీఎం, సీపీఐ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు మండిపడుతున్నారు. వారు ప్రకటించిన ధరకు భోజనం కొనుక్కుని కొన్ని రోజులు జీవించి చూపాలని రాజ్ బబ్బర్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియాలకు ఆమ్ ఆద్మీ పార్టీ సవాలు విసిరింది.
ఏసీ గదుల్లో కూర్చుని ప్రజలను అవమానిస్తున్నారని వారికి అధికారం తెచ్చిన గర్వంతో బుర్రలు పని చేయట్లేదని నిన్న ఢిల్లీలో నిర్వహించిన నిరసనల సందర్భంగా నినాదాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. రాజకీయ నాయకులు సంయమనంతో వ్యాఖ్యలు చేయాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజలను అవమానించకూడదని సీపీఐ ఎంపీ రాజా వ్యాఖ్యానించారు. ప్రజల్లోకి వచ్చి జీవించి అలాంటి వ్యాఖ్యలు చేయాలని ఏవో లెక్కల ప్రకారం.. పేదలు లేరని, అందరూ ఉన్నావారేనని అనడం కేంద్రం అవివేకాన్ని బయటపెడుతుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని వారికి ప్రజల పట్ల ఏరకమైన వైఖరి ఉందో ఈ ఘటనే రుజువు చేస్తోందని, అలాంటి వారు ఆహారభద్రత ఎలా కల్పిస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణం అహ్లూవాలియా, రాజ్ బబ్బర్ లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.