: బిల్లు పెడితే అడ్డుకుంటాం:లగడపాటి
రాష్ట్ర విభజనకు అనుకూలంగా అసెంబ్లీలో బిల్లు పెడితే అడ్డుకుంటామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలో గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన మౌనదీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వేర్పాటువాదులకు టీడీపీ తొత్తుగా మారిందని మండిపడ్డారు. అసెంబ్లీలో విభజనకు అనుకూలమంటూ బిల్లు పెడితే దాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నష్టమే కానీ లాభం లేదని అందుకే రాజీనామాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి పార్టీలకతీతంగా మద్దతు అవసరమని, అన్ని పార్టీల నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని లగడపాటి పిలుపునిచ్చారు.