: చచ్చిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు!
ఒడిశాలో విచిత్రం చోటు చేసుకుంది. అందరూ చనిపోయాడని భావించిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఘటన దేవ్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే, విజయ్ నగర్ కు చెందిన దిబ్యాశంకర్ గర్తియా ఓ రోజు మిత్రులతో పార్టీ చేసుకున్నాడు. మిత్రులందరూ వారివారి ఇళ్ళకు చేరుకున్నా దిబ్యాశంకర్ మాత్రం ఇంటికెళ్ళలేదు. మిత్రులకూ అతని ఆచూకీ తెలియలేదు. దీంతో, అతని తండ్రి కేసు నమోదు చేశాడు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఓ రోజు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఓ శవాన్ని చూపించి, దిబ్యాశంకర్ దే అయివుంటుందన్నారు. అతని కుటుంబ సభ్యులూ, శవం తమ కుర్రాడిదే అని తలూపారు. అంతేగాకుండా, శవాన్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు జరిపారు. ఇక, దిబ్యాశంకర్ ను చంపేసి ఉంటారన్న కోణంలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. దిబ్యాశంకర్ జులై 8న అదృశ్యం కాగా, సరిగ్గా నిన్న రాత్రి ఆ వ్యక్తే స్వయంగా తన తండ్రికి ఫోన్ చేయడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.