: 'స్మార్ట్' గా ఆలోచిస్తున్న పంజాబ్ ఖైదీలు


పంజాబ్ లో ఖైదీలు ఆధునిక సాంకేతికతను బాగానే అందిపుచ్చుకున్నట్టుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా వారు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. యువ ఖైదీలు తమ మిత్రులతో ముచ్చటించేందుకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను వేదికలుగా చేసుకుంటున్నారు. అందుకు ఈ స్మార్ట్ ఫోన్లే సాయపడుతున్నాయట. ముఖ్యంగా, నేటి యువతను కట్టిపడేస్తున్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ను వారు విరివిగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.

జైలు లోపలి జీవితం, అక్కడి కష్టనష్టాలు, కారాగారం ఆవరణలో తీసిన ఫొటోలు తమ సన్నిహితులతో పంచుకోవడానికి ఫేస్ బుక్కే వారధి. ఆ విషయం పంజాబ్ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న పలువురు యువకుల పేరిట నమోదైన ఫేస్ బుక్ ఖాతాలను పరిశీలిస్తే అవగతమవుతుంది. తమ బెయిలు వివరాల గురించి, శిక్షాకాలంలో ఎదురైన అనుభవాలను తమ పోస్టింగుల్లో పొందుపరిచి బంధుమిత్రులతో పంచుకుంటున్నారు.

ఈ విషయమై, పంజాబ్ జైళ్ళ శాఖ అడిషనల్ డీజీపీ రాజ్ పాల్ మీనాను ప్రశ్నిస్తే ఏమంటున్నాడో వినండి. 'స్మార్ట్ ఫోన్ల గురించి నాకేమీ తెలియదే. మీ వద్ద ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి, పరిశీలిస్తాం' అని బదులిచ్చారు. అయితే, ఇదే జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ ఖైదీల చేతికి ఈ స్మార్ట్ ఫోన్లు అందితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టం కాదని పలువురు మాజీ పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. జైలు సిబ్బందికి తెలియకుండా ఈ అత్యాధునిక ఫోన్లు ఖైదీలకు అందే అవకాశాల్లేవని వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News