: రూపాయికే ఫుల్ గా తినొచ్చు: కేంద్ర మంత్రి
కనీసం 50 రూపాయలు ఖర్చు చేయనిదే ఫుల్ మీల్స్ దొరకని ఈ రోజుల్లో.. కోరుకుంటే రూపాయికే ఫుల్ మీల్స్ తినొచ్చని కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇటీవల ప్రణాళిక సంఘం రోజుకు 27 రూపాయల ఆదాయం ఉన్నవారు పేదవారు కాదని, దేశంలో పేదరికం తగ్గిందని వెలువరించిన కాకిలెక్కలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ బబ్బర్ 12 రూపాయలుంటే సుష్టుగా భోజనం చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు. మరో కాంగ్రెస్ నేత రషీద్ మసూద్ 5 రూపాయలతో ఢిల్లీలో కడుపు నింపుకోవచ్చన్నారు. దీనికి కొనసాగింపుగా కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా రూపాయికే భోజనం చేయవచ్చని ముక్తాయించారు.
కావాలనుకుంటే మీ పొట్టను రూపాయితో లేదా 100 రూపాయలతో నింపుకోవచ్చు. ఏం తింటున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంది అని ఫరూక్ చెప్పారు. మన నేతలు ఇంకా పూర్వకాలంలోనే ఉన్నారని వారి వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. రూపాయికి ఏమొస్తుంది? ఒక చాక్లెట్ లేదా బిస్కెట్ తప్ప. పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని సబ్సిడీ మీద కొన్ని రాష్ట్రాలలో అందిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని చూసి రూపాయితో పొట్టపోసుకో్వచ్చని పాలకులు స్టేట్ మెంట్లు ఇస్తున్నట్లుంది. బియ్యం సరే, దాన్ని వండుకోవడానికి గ్యాస్, కూరలు, కారం, ఉప్పు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో నేతలు ఆలోచించగలిగితే భాగ్యవంతమైన భారతదేశంలో పేదరికం ఎప్పుడో అంతరించిపోయేది.