: ఆస్థమాకు కారణం ఇదే


ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని పీడిస్తున్న జబ్బు ఆస్థమా. ఈ వ్యాధికి చికిత్స పరంగా స్టెరాయిడ్లు మాత్రమే ఉంటున్నాయి. అయితే వీటివల్ల ఇతరత్రా ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఈ వ్యాధికి చేస్తున్న చికిత్స విధానాలు పెద్దగా పనిచేయడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు ఆస్థమా వ్యాధి నివారణకు కొత్త రకమైన చికిత్సను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్థమా వ్యాధికి కారణమైన ఒక కీలక ఎంజైమును శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో ఆస్థమా వ్యాధితోబాటు గుండెజబ్బుల్లో కూడా దీని ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. దీంతో సదరు ఎంజైమును లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆస్థమా వ్యాధికి మెరుగైన చికిత్స అందించవచ్చని తేల్చారు.

అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఆస్థమా వ్యాధికి ఒక కొత్తరకం చికిత్సను కనుగొన్నారు. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్న ఈ పరిశోధనలో గుండెజబ్బుల్లో పాత్రవున్న ఒక ఎంజైమును లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆస్థమాకు మెరుగైన చికిత్స చేయవచ్చని కనుగొన్నారు. సీఏఎంకే2 అనే ఈ ఎంజైముకి శ్వాసమార్గంలో ఆక్సీకరణానికి సంబంధించిన హానికారక ప్రభావాలతో సంబంధం ఉందని, ఇది ఆస్థమా లక్షణాలను ప్రేరేపిస్తుందని తెలిపారు. సీఏఎంకే2ను లక్ష్యంగా చేసుకొని మందులను తయారు చేయడానికి తాము నిర్వహించిన పరిశోధన వీలుకల్పిస్తుందని వీరు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆస్థమా వ్యాధి చికిత్సకు సరైన మందులు లేవని, ప్రస్తుత చికిత్స విధానాలు కూడా సరిగా పనిచేయడం లేదని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మార్క్‌ ఆండర్సన్‌ తెలిపారు. సీఏఎంకే2ను అడ్డుకోవడం ద్వారా అలర్జిక్‌ ఆస్థమాకు మెరుగైన చికిత్స అందిచవచ్చని మార్క్‌ తెలిపారు. ఈ ఎంజైము గుండె కండరాల కణాల ఆక్సీకరణలో కీలక పాత్ర పోషిస్తుందని, దీనివల్ల గుండెజబ్బులు, గుండెపోటు వస్తోందని గతంలో తేలిందని, శ్వాసకోశ వ్యవస్థ ఆక్సీకరణంలో కూడా దీని పాత్ర ఉండవచ్చని తమకు అనిపించిందని మార్క్‌ తెలిపారు.

తొలుత వీరు ఈ ఎంజైమును ఎలుకల శ్వాసనాళ కండర కణాల్లో పరీక్షించారు. అయితే పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఆ తర్వాత ఎంజైమును శ్వాసనాళం లైనింగ్‌ (ఎపిథీలియల్‌) కణాల్లో పరీక్షించారు. ఎంజైమును అడ్డుకున్న ఎలుకల్లో సీఎఎంకే2 ఆక్సీకరణ తక్కువగా ఉందని వీరు గుర్తించారు. వీటిలో శ్వాసనాళం కండరం కుచించుకుపోవడంగానీ, ఆస్థమా లక్షణాలుగానీ కనిపించలేదు. ఎంజైమును అడ్డుకోని ఎలుకల్లో మాత్రం ఆక్సీకరణ వత్తిడి ఎక్కువగా ఉందని, ఫలితంగా శ్వాసనాళం కుంచించుకుపోయి ఆస్థమా లక్షణాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News