: మరో ఎనిమిదేళ్లకు అరుణుడిపైకి మనుషులు వెళతారు!


అరుణగ్రహం రోజురోజుకూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపధ్యంలో అంగారక గ్రహంపైకి మనుషులను పంపించేందుకు ప్రపంచ దేశాలు తహతహలాడుతున్నాయి. అయితే అమెరికా కన్నా కూడా ముందుగా తమ వ్యోమగాములను అంగారకుడిపైకి పంపడానికి బ్రిటన్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. దీని ప్రకారం నాసాకన్నా కూడా 12 ఏళ్లకు ముందే అంగారకుడిపైకి బ్రిటన్‌ తన వ్యోమగాములను పంపడానికి సన్నాహాలు చేస్తోంది.

లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం అంగారకుడిపైకి మానవసహిత యాత్ర చేసేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ టామ్‌పైక్‌ మాట్లాడుతూ 2021లో ముగ్గురు వ్యోమగాములు అంగారకుడిపైకి వెళ్లి సురక్షితంగా తిరిగి భూమిపైకి వస్తారని, దీనికోసం రెండు వేర్వేరు భాగాలుగా ఉన్న చిన్న వ్యోమనౌకను వీరు ఉపయోగించుకుంటారని, వ్యోమనౌక రెండు భాగాలు ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయని, దీనివల్ల వ్యోమగాములకు గురుత్వ శక్తి ప్రభావంలోనే ఉన్న భ్రమ కలుగుతుందని తెలిపారు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే వ్యోమగాములు భూమిపైనుండి అంగారకుడి వద్దకు వెళతారని, అక్కడ కొద్దిసేపు సంచరించి తిరిగి భూమికి బయలుదేరతారని పైక్‌ చెబుతున్నారు. ఈ వ్యోమగాముల యాత్రకు రోబోలు కూడా తమ సహకారాన్ని అందిస్తాయని పైక్‌ చెబుతున్నారు.

అయితే, అటు నాసా మాత్రం అంగారకుడిపైకి 2033 నాటికైనా మానవసహిత రోదసి యాత్రను నిర్వహించాలని ప్రణాళికలను రూపొందించుకుంటోంది. అంతకన్నా ముందే వ్యోమగాములను అంగారకుడిపైకి పంపాలని ఇటు బ్రిటన్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఎవరు ముందుగా మనుషులను అరుణుడిపైకి పంపనున్నారో వేచి చూడాలి!

  • Loading...

More Telugu News