: సెల్ఫ్ కంట్రోల్‌తో బరువూ కంట్రోల్
బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఇలా చేయాల్సిందే. అధిక బరువుండేవారు తాము బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మనం ఏం చేసినా వాటన్నింటికన్నాముందు మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది. అది ఏమంటే మనపై మనం అదుపును కలిగి ఉండడం. మన జిహ్వచాపల్యంపై అదుపును కలిగివుంటే ఇక ఎంచక్కా మనబరువు తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. నాలుకను అదుపులో ఉంచుకుంటే తప్పకుండా బరువు తగ్గేందుకు మనం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయంటున్నారు.
కేంబ్రిడ్జ్‌కి చెందిన పరిశోధకులు స్వీయ నియంత్రణ గురించి ఒక పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో తేలిందేమంటే బరువు తగ్గాలనుకునేవారు కేవలం తాము బరువు తగ్గాలనే సంకల్పం మాత్రమే ఉంటే చాలదని, వారిపై వారికి స్వీయ నియంత్రణ కూడా చాలా అవసరమని తేల్చారు. స్వీయ నియంత్రణతో మెరుగైన ఫలితాలను పొందవచ్చని వీరు తమ పరిశోధనలో గుర్తించారు. డబ్బు పొదుపు చేయడానికి కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుందని కూడా వారు చెబుతున్నారు. మనకు నోరూరించే పదార్ధాలు, వస్తువులకు దూరంగా ఉండేలా స్వీయ నియంత్రణ (ప్రికమిట్‌మెంట్) పాటించడం, వీటితోబాటు మానసిక సంకల్పం ఈ రెండింటి ప్రభావాలను పరిశోధకులు తమ పరిశోధనలో పోల్చి చూశారు.
ఇందులో అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని కొనకపోవడం, అలాగే గడువుకు ముందే డబ్బును తీసుకుంటే భారీ జరిమానా పడే ఖాతాల్లో డబ్బు పొదుపు చేయడం వంటివి ఈ ప్రికమిట్‌మెంట్ కిందికే వస్తాయి. ఇలాంటివి భవిష్యత్తు గురించి ఆలోచించడంలో పాలుపంచుకునే మెదడులోని భాగాన్ని ప్రేరేపిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇది సంకల్పం విషయంలో కీలక పాత్ర పోషించే మెదడులోని భాగంతో సమాచార ప్రసారాలనూ పెంపొందిస్తున్నట్టు కూడా ఈ పరిశోధనలో తేలింది. ఈ కొత్త పరిశోధనకు సంబంధించిన వివరాలు పలుమార్లు స్వీయనియంత్రణ విఫలం కావడాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను తెరుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.